మన నిత్యం తీసుకునే ఆహార పదార్థాలు కల్తీ బారిన పడటం ఎప్పటి నుంచో జరుగుతోంది. వినియోగదారులు ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ కల్తీ నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా తాము వినియోగిస్తున్న పాలలో ప్లాస్టిక్ ఉందని తెలిసి అవాక్కయ్యారు కూకట్ ‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన పవన్, సౌమ్య దంపతులు.

ఉదయం అందరిలాగే పాల బూత్‌కు వెళ్లి పాలు తెచ్చుకున్న పవన్… ఆ పాలను ఎప్పటిలాగే వేడి చేశారు. అయితే అవి పగిలిపోయాయి. పాలు పగిలిపోవడం సాధారణమే అయినా పగిలిపోయిన పాలు కాస్త కొత్తగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ప్లాస్టిక్ లాంటి పదార్థం కలిసిందని అనిపించింది.

ఇదేంటని పాల బూత్ యజమానిని నిలదీస్తే నీ దిక్కున్న చోట చెప్పుకోవాలని వారిని బెదిరించారు. దీంతో బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.