హైదరాబాద్‌ పరిధి మాదన్నపేటలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 28 మంది కరోనా బారిన పడటం సంచలనం కలిగిస్తోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ శనివారం నాటికి ఆ సంఖ్య 28కి చేరింది. వీరిలో 11 నెలల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉండటం గమనార్హం.

మాదన్నపేటలోని ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 15 కుటుంబాలు ఉంటున్నాయి. ఓ కుటుంబంలోని చిన్నారికి ఏప్రిల్‌ చివరి వారంలో పుట్టినరోజు వేడుక నిర్వహించగా కొన్ని కుటుంబాలు పాల్గొన్నాయి. ఆ చిన్నారి తండ్రి వారం క్రితం అనారోగ్యానికి గురయ్యారు. నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. మర్నాడు చిన్నారికీ సోకింది. అనంతరం ఒక్కొక్కరిలో లక్షణాలు బయటపడ్డాయి. 13 మందిలో వైరస్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

అలా మొదట 15 మందికి నిర్ధారణ అయింది. తర్వాత మరో 13 మందికి లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో అందరిలో వైరస్‌ ఉన్నట్లు తేలింది. ఫలితంగా ఆపార్ట్‌మెంట్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 28కు చేరినట్టు వైద్యులు తెలిపారు. ఇంటికే పరిమితమైన ఇన్ని కుటుంబాలకు వైరస్‌ ఎలా సోకిందనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు. వేడుకలో పాల్గొన్న బంధువులు, స్నేహితులకు నిత్యావసరాలను సరఫరా చేసిన వారి వివరాలు రాబడుతున్నారు.