భవన నిర్మాణాలు చేస్తానని చెప్పి వినియోగదారులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై అసహజ లైంగికదాడి కేసు నమోదయ్యింది. శ్రీధర్‌రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్‌ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సనత్‌నగర్‌ పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సనత్‌నగర్‌కు చెందిన సీహెచ్‌ చౌదరి (పూర్తి పేరు రాయడం లేదు) స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: మసాజ్‌ చేయమని, కత్తితో బెదిరించి నందగిరి హిల్స్‌లో ఉంటున్న శ్రీధర్‌రావు దగ్గర చౌదరి జిమ్‌ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు, బాడీగార్డుగా పని చేస్తున్నాడు. అక్టోబర్‌ 10వ తేదీ రాత్రి ఇద్దరూ బయటకు వెళ్లి 1.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. కాసేపటి తర్వాత సెకండ్‌ ఫ్లోర్‌లోని తన బెడ్‌ రూమ్‌కు రమ్మని చౌదరికి చెప్పిన శ్రీధర్‌రావు వెన్నునొప్పిగా ఉందంటూ మసాజ్‌ చేయమని అడిగాడు. దీంతో చౌదరి కొంతసేపు మసాజ్‌ చేశాడు. ఆ సమయంలో శ్రీధర్‌రావు కొన్ని పిల్స్‌ వేసుకోవడం గమనించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే చౌదరిని శ్రీధర్‌రావు బలవంతంగా దగ్గరకు లాక్కోవడం ప్రారంభించాడు.

చౌదరి నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో కత్తితో బెదిరించాడు. చౌదరి నిరాకరించడంతో కత్తితో చొక్కా సహా బట్టలన్నీ చింపేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు తాను వద్దంటూ వారిస్తున్నా, ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా శ్రీధర్‌రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. రెండు గంటల పాటు నరకం అనుభవించానని, విపరీతమైన రక్తస్రావం జరిగిందని తెలిపాడు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని శ్రీధర్‌రావు బెదిరించినట్లు పేర్కొన్నాడు. తాను ఇన్నాళ్లూ భయపడ్డానని, ఇప్పుడతని మోసాలు బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చౌదరి పోలీసులకు తెలిపాడు. చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రావుపై సనత్‌నగర్‌ పోలీసులు అసహజ లైంగిక దాడి, బెదిరింపులకు సంబంధించి ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్‌ (814/2021) నమోదు చేశారు. కాగా, చీటింగ్‌ కేసులో గురువారం అరెస్టయిన శ్రీధర్‌రావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.