ఓ ఎన్నారై భర్త కట్టుకున్న భార్య అని చూడకుండా శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి భార్యను వదిలేసి అమెరికా పారిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో భర్త భార్యకు ఎలాంటి టార్చర్ పెట్టాడు? ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు: అది హైదరాబాద్ హిమాయత్ నగర్ పరిధిలోని దోమల్ గూడ ప్రాంతం. ఇక్కడే రామేశ్వరి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. ఎమ్మెస్సి పూర్తి చేసిన రామేశ్వరికి ఆమె తల్లిదండ్రులు యూసుఫ్ గూడకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు. పైగా మహేష్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండడంతో అమ్మాయిల తల్లిదండ్రులు రామేశ్వరిని అతనికి ఇవ్వాలని బలంగా అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే గతేడాది మే 26న మహేష్, రామేశ్వరిల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి సమయంలో రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ కు రూ.10 లక్షల కట్నంతో పాటు 20 తులాల బంగారం ఇచ్చారు.
మా కూతురుకి మంచి అమెరికా సంబంధం వచ్చిందని రామేశ్వరి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ఇక జూలై 18న మహేష్ తన భార్య రామేశ్వరిని తీసుకుని అమెరికాకు వెళ్లిపోయాడు. అమెరికా వెళ్లిన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ వారం రోజులు తిరిగే సరికి భర్త మహేష్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. కట్నం తక్కువగా తెచ్చువంటూ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. ఇదే కాకుండా పక్కింటి వ్యక్తులతో మాట్లాడొద్దని, బయట కూర్చొవద్దనే ఆంక్షలు కూడా విధించాడు. ఇదే కాదండోయో రామేశ్వరిని హుక్కా పార్లర్ కు తీసుకుని బలవంతంగా హుక్కా తాగాలంటూ టార్చర్ పెట్టడం, చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్లతో పోల్చి హేళన చేయడం, కొన్ని రోజులు ఆగి ఉండే నాకు రూ.50 లక్షలు ఇచ్చే సంబంధం వచ్చి ఉండేదంటూ మహేష్ రామేశ్వరికి చుక్కలు చూపించేవాడు.
ఇక భర్త టార్చర్ ను భరించలేకపోయిన రామేశ్వరి నన్ను ఇండియాకు పంపాలని వేడుకునేది. ఇవేం పట్టించుకోని మహేష్ రాత్రుళ్లు రోజూ భార్యను అనేక వేధింపులకు పాల్పడేవాడు. అయితే ఇటీవల రామేశ్వరి తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మహేష్ తన భార్యతో పాటు ఇండియాకు వచ్చాడు. వచ్చి ఒక రోజు కూడా ఉన్నాడో లేదో అప్పుడే అమెరికాకు పారిపోయాడు. దీంతో భర్త టార్చర్ ను భరించలేకపోయిన రామేశ్వరి తన కుటుంబ సభ్యుల సాయంతో యూసుఫ్ గూడలోని భర్త మహేష్ ఇంటి ముందు నాకు న్యాయం నిరసనకు దిగింది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నాకు నా భర్తతో విడాకులు ఇప్పించాలని వేడుంది.