హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన ఓ మహిళా డాక్టర్ ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మింది. అతనితో బిజినెస్ డీల్ కుదుర్చుకుంది. అతను చెప్పినట్టుగా చేసింది. అయితే ఇది గమనించిన కూతురు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు గుట్టు రట్టైంది. వివరాలు: మహిళా డాక్టర్‌కు నైజిరీయాకు చెందిన మెస్సీ డాన్ హోతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అతడు తాను ఇటలీకి చెందిన వ్యక్తిని అంటూ వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొంతకాలంగా ఆమెతో పరిచయం కొనసాగించాడు. అయితే ఇటీవల ఆమెతో మెస్సీ ఓ బిజినెస్ డీల్ మాట్లాడాడు. హెర్బల్‌ ఫార్మూలా, మెడిసిన్స్‌ పంపిస్తే తమ దేశంలో వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. ఇందు కోసం రూ. 5కోట్లు చెల్లించనున్నట్టుగా చెప్పాడు. అయితే కొంతకాలంగా పరిచయం ఉండటంతో వైద్యురాలు అతడి మాటలు నమ్మింది. దీంతో మెస్సీ తన గేమ్ ప్రారంభించాడు. ఆమెకు మరింత నమ్మకం కలిగే ఓ అకౌంట్‌కు చెందిన డెబిట్ కార్డును పంపాడు. అందులో నుంచి వైద్యురాలు రూ. 4 వేలు డ్రా చేసింది. ఇక, ఆ తర్వాత ఢిల్లీ కస్టమ్స్ అధికారుల పేరుతో మెస్సీ వైద్యురాలకు ఫోన్ చేశాడు. మీకు వచ్చిన రూ. 5కోట్లు తీసుకోవాలంటూ చెప్పాడు.

ఇందు కోసం డబ్బులు చెల్లించాలని నమ్మించాడు. దీంతో వైద్యురాలు పలు దఫాలుగా రూ. 20లక్షలు వాళ్లు చెప్పిన అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత మెస్సీ తన కుమార్తె చనిపోయిందనే నాటకం ఆడి మరో రూ. 21లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అయితే వైద్యురాలు ఇంకా డబ్బులు పంపుతూనే ఉండటంతో ఆమె కూతురుకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె జూన్ 29న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతడిది ఇటలీ కాదని నైజీరియన్ అని తేల్చారు. అతడి అంతా డ్రామా అని ఇప్పిటకే పలువురిన ఇలాగే మోసం చేశాడని గుర్తించారు. ఢిల్లీలో అతడిన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, విజిటింగ్ వీసా మీద ఇండియాకు వచ్చిన మెస్సీ వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉంటూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు.