హైదరాబాద్‌(మేడ్చల్‌): వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యమైన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  బీహార్‌ రాష్ట్రానికి చెందిన జమాల్‌ 10 ఏళ్ల క్రితం బతుకుదెరువుకు మేడ్చల్‌కు వచ్చి పట్టణంలోని కుమ్మరిబస్తీలో తన చెల్లి రుక్సానా(20)తో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం కిరాణా షాపుకు వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లిన రుక్సానా ఎంతకీ ఇంటికి చేరకపోవడంతో అన్న జమాల్‌ చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మేడ్చల్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

డ్యూటీకి వెళ్లిన వ్యక్తి:

మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కండ్లకోయలో నివాసం ఉండే అల్లి బాలకృష్ణ(31) ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 11న డ్యూటీకి వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లిన బాలకృష్ణ తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో శుక్రవారం అతని భార్య రేణుక మేడ్చల్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.