హైదరాబాద్: చర్చికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి ఇద్దరిని వివాహం చేసుకుని, మరో యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసిన చర్చి పాస్టర్‌ను మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం: ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన సాధు చిన్నా, అలియాస్ వెంకటేశ్వర్లు, అలియాస్ జోసెఫ్(35) బోడుప్పల్, సాయి మారుతి నగర్ కాలనీలో ఉంటున్నాడు. ఈ మధ్యనే ఉప్పల్‌లో బ్లెస్‌డ్ చర్చిని ప్రారంభించాడు. కలవరీ టివి, ఆరాధన టివిలో జీసెస్ ప్రార్థనల గురించి కార్యక్రమాలు నిర్వహించేవాడు. 2010లో సంధ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాలిక ఉంది, కొంత కాలానికి భార్య సంధ్య మృతిచెందడంతో 2015లో ఫిర్జాదీగూడకు చెందిన ఆవుల రెబెకలతా అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు(5) కలిగాడు. అదనపు కట్నం రూ.10లక్షలు తీసుకుని రావాలని జోసెఫ్ ఒత్తిడి చేయడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. అదనపు కట్నం తీసుకువచ్చేందుకు బాధితురాలు నిరాకరించడంతో దాడి చేసేవాడు.

దీంతో రెబెకా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నిందితుడు ఉప్పల్‌లో కొత్తగా గదిని అద్దెకు తీసుకుని బ్లెసెడ్ చర్చిని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న బాధితురాలు చర్చిలో ప్రార్థనల కోసం వచ్చేది. 2020, జనవరి,23వ తేదీన జీసెస్ ప్రార్థనలు ఉన్నాయని చెప్పి ఆమెను కారులో శంషాబాద్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగికదాడి చేశాడు. వివాహం చేసుకుంటానని చెప్పి అప్పటి నుంచి యువతిని శారీరకంగా వాడుకుంటున్నాడు. తనను వివాహం చేసుకోవాలని జాన్సీరాణి పలుమార్లు జోసెఫ్‌ను నిలదీస్తున్నా దాటవేసేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన జోసెఫ్ ఇంటికి వెళ్లి తనను వివాహం చేసకోవాలని నిలదీసింది. దీనికి నిందితుడు తాను వివాహం చేసుకోనని చెప్పాడు. అంతేకాకుండా నిందితుడి తండ్రి కృష్ణయ్య, సోదరుడు సాధు పెద్ద వెంటకటేశ్వర్లు బెదిరించారు. దీంతో బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే రెండో భార్య రెబెకా తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాద చేసింది.

రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి సోదరుడు, తండ్రిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాస్టర్‌గా చలామని అవుతున్న జోసఫ్ అలియాస్ సాధు ఇటీవలి కాలంలో యువతులపై అత్యాచారం చేయడమే కాకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతులపై లైంగిక దాడులు చేస్తున్న చర్చి ఫాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పిఎస్ ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.