తెలిసిన వాడే కదా అని నమ్మి అతని వెంట వెళ్లిన ఓ స్త్రీ, దారుణంగా మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి వెంట వెళ్లిన పాపానికి అతని చెరలో చిక్కి, అత్యాచారానికి గురైంది ఆ మహిళ. ఇంటివైపే వెళ్తున్నామని నమ్మబలికి, ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె జననాంగాలను తీవ్రంగా గాయపరిచి ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో మోది, అక్కడి నుంచి పరారయ్యాడు ఆ దుండగుడు. ఆ రాత్రంతా అక్కడే అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ, మరుసటి రోజు మెలుకువ రాగానే కష్టపడి వాళ్లింటికి పాక్కుంటూ చేరుకుంది. ఈ దారుణమైన ఘటన, హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం: భర్తతో విభేదాలొచ్చిన్న ఓ మహిళ(50) భర్తతో విడిగా ఉంటోంది. ఆమె ముసాపేటలో ఉంటున్న తన తల్లితో కలిసి ఉంటోంది. అక్కడే ఆమె కూలి పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేది. అయితే ఆమెకు ముసాపేట యాదవబస్తీలో నివాసం ఉన్నప్పుడు వాళ్ల పక్కింట్లో ఉండే మేస్త్రీ లుకలాపు రాము(38) తో పరిచయం ఏర్పడింది. కాగా ఆమహిళ ప్రతిరోజు పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ముసాపేట నుంచే నడిచివెళ్లేది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాము ఆమెపై కన్నేసాడు. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వేచి చూసిన రాము, శుక్రవారం సాయంత్రం ఆమెను ముసాపేట నర్సింహస్వామి ఆలయం వద్ద అడ్డగించాడు. నేను కూడా మీ ఇంటి వైపే వెల్తున్నానంటూ నమ్మబలికి తన బైక్ పై ఎక్కించుకున్నాడు.

అక్కడి నుంచి రాఘవేంద్ర సొసైటీని ఆనుకుని ఉన్న చెట్ల పొదల్లోకి బలవంతంగా తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అలాగే ఆమె జననాంగాన్ని కూడా దారుణంగా గాయపరిచాడు. అనంతరం ఆమె తలపై బండరాయితో మోదాడు. దాంతో ఆమె ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి. అలాగే ఆమె కనుగుడ్లు కూడా చిట్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతం అంతా చేసిన ఆ దండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావానికి గురైనా ఆమె అపస్మారక స్థితిలోనే ఆ రాత్రంతా గడిపింది. ఉదయం మెలుకువ రాగానే ఒంటిపై ఉన్న లోదుస్తువులతోనే అక్కడి నుంచి పాక్కుంటూ తన ఇంటికి చేరుకుంది. తన తల్లి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆమెను ఉస్మానియా హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి దారుణంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాధితురాలి విషయం తెలుసుకున్న నిందితుడు, ముందు జాగ్రత్తగా తన కుటుంబంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం కూకట్ పల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.