హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై ఓ పాఠశాల హెడ్ మాస్టర్ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హెడ్ మాస్టర్‌తో పాటు అతని భార్య కూడా తనపై వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు ఇటీవలే తల్లిదండ్రులతో చెప్పింది.

వివరాలు: హైదరాబాద్ రామాంతపూర్‌కి చెందిన ఓ బాలిక అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జానెట్ జార్జి రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. హాస్టల్లో ఉండే బాలికపై హెడ్ మాస్టర్ కన్ను పడింది. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలో ఓసారి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధిత బాలిక తనలో తానే కుమిలిపోయింది. ఆమె నిస్సహాయతను అదనుగా తీసుకున్న హెడ్ మాస్టర్ రెండేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.

నిందితుడి భార్య కూడా బాలికను వేధిస్తుండేది. ఆమెతో ఇంటి పనులు చేయించుకోవడం నిరాకరిస్తే కొట్టడం చేసేది. ఇటీవల వీరిద్దరి వేధింపులు మరింత తీవ్రం కావడంతో బాలిక తట్టుకోలేకపోయింది. రామాంతపూర్‌లోని ఇంటికి చేరిన బాలిక తల్లిదండ్రులతో అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు…