ప్రేమ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతులను మోసం చేస్తున్న నిందితుడి లీలలు బయటపడ్డాయి. ఫేస్‌బుక్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని, వారిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని మోసం చేస్తున్నాడు. భార్య ఫిర్యాదుతో మొత్తం విషయం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం: నగరంలోని చందానగర్, ఆర్టీసీ కాలనీకి చెందిన విజయ్‌భాస్కర్‌కు ఎపిలోని ఒంగోలుకు చెందిన బంధువుల యువతి సౌజన్యతో వివాహం జరిగింది. విజయభాస్కర్ ఏపనిచేయకున్నా వివాహం చేసుకుంది. సౌజన్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. వివాహం సమయంలో భారీగా కట్నం, బంగారు ఆభరణాలు పెట్టారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నిందితుడి కుటుంబ సభ్యులు మరో వివాహం చేసేందుకు అంతా కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా అదనపు కట్నం కావాలని సౌజన్యను వేధించడం ప్రారంభించారు. విజయభాస్కర్ వివాహం జరిగినా ఫేస్‌బుక్‌లో పలువురు యువతులతో ఛాటింగ్ చేసేవాడు.

తనకు వివాహం కాలేదని, వివాహం చేసుకుంటానని చెప్పి వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకుంటున్నాడు. ఫేస్‌బుక్‌లో ఉన్న ఎపికి చెందిన యువతులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్నాడు. ఇప్పటి వరకు వివాహం పేరుతో పదులకు పైగా అమ్మాయిలను మోసం చేసినట్లు విజయ్‌పై ఆరోపణలు ఉన్నాయి. తాను హిస్కోలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఓ యువతి విజయ్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని, అతడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెక్ చేయడంతో విషయం మొత్తం బయటపడింది. అప్పటికే వివాహం అయి మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో తనది తప్పని యువతి కాళ్లు మోక్కాడు. ఈ క్రమంలోనే భార్యను, కుమారుడిని వదిలేసిన విజయ్ వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధంకాగా ఎపిలోని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విజయ్‌భాస్కర్‌ను నిలదీసేందుకు నగరానికి వచ్చిన సౌజన్యపై అతడి తల్లిదండ్రులతో కలిసి దాడి చేశారు. దీంతో బాధితురాలు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని సౌజన్య వేడుకుంటోంది.