హైదరాబాద్ నగరంలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు కంటపడకుండా ఉండేందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నాయి. స్పా సెంటర్ల పేరిట, ఫిజియోథెరపీ క్లినిక్‌ల ముసుగులో వ్యభిచార దందాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ముఠా గుట్టును సైఫాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివరాలు: ఖైరతాబాద్‌ పరిధిలో ఏసీ గార్డ్స్‌లో, ఫిజియోథెరపీ క్లినిక్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు వ్యభిచార ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఓ కానిస్టేబుల్‌ను మారువేషంలో ఆ ఫిజియోథెరపీ క్లినిక్‌కు పంపారు. అనంతరం డీఐ రాజునాయక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేపట్టారు. మారువేషంలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ నిర్వాహకులకు డబ్బులు ఇస్తున్న సమయంలో మిగతా పోలీసులు వెళ్లి నిందితులను పట్టుకున్నారు.

ఫిజియోథెరపీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిర్వాహకురాలితో పాటు, నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు సెల్‌ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న నిందితురాలు మెహరాజున్నీసా(45), గతంలో మెహిదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసిందని పోలీసులు గుర్తించారు. యజమాని దానిని అమ్మేయడంతో ఆమె మసాజ్ సెంటర్ నిర్వాహకురాలిగా మారింది. మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించింది. అనంతరం మసాజ్ సెంటర్‌ను ఏసీ గార్డ్స్‌కు మార్చినట్టుగా పోలీసులు తెలిపారు..