చంపాపేట పరిధిలో శనివారం భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే తన భార్య స్వప్నను చంపినట్లు ప్రేమ్‌కుమార్‌ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు: మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ కొత్తపేట తండా ప్రాంతానికి చెందిన మోహన్‌, రూప దంపతుల కుమార్తె స్వప్న (21) నెల రోజుల క్రితం మహేశ్వరానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ (24)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు చంపాపేట్‌ ఎస్‌జీఆర్‌ కాలనీలో అద్దెకు దిగారు. కాగా గత కొన్ని రోజులుగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్వప్న ఇంటికి వచ్చి పోతుండటాన్ని గమనించిన ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయాలని వారికి సూచించాడు.

ఇదిలా ఉండగానే శనివారం ఉదయం ప్రేమ్‌కుమార్‌ ఇంట్లో లేని సమయంలో స్వప్న తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఉదయం 11.30 గంటల సమయంలో ప్రేమ్‌కుమార్‌ ఇంటికి తిరిగి రాగా వారిద్దరు కలిసి ఉండటాన్ని చూశాడు. ఆవేశంతో ఘర్షణకు దిగి స్వప్నపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఇది గమనించిన స్వప్న ప్రియుడు అక్కడి నుంచి పారిపోగా ప్రేమ్‌కుమార్‌ భవనం పైనుంచి దూకేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ప్రేమ్‌కుమార్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.