అతనికి మహిళలను ట్రాప్ చేయడమే పని. అలా ట్రాప్ చేసిన వారిని తన మాయ మాటలతో నమ్మించి దారుణాలకు పాల్పడేవాడు. ఈ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ గురువారం నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నారపల్లికి చెందిన హుస్సేన్ ఖాన్ 2008 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో హుస్సేన్‌ను అరెస్ట్ చేశాం. అతడు ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని నేరాలకు పాల్పడేవాడు. తొలుత యువతులను మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. అలా తన బుట్టలో పడిన యువతులను కల్లు కంపౌండ్ వదద్దకు తీసుకెళ్లి కల్లు తాగించేవాడు.

అనంతరం యువతులను స్కూటీ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. అక్కడ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి దగ్గర ఉన్న బంగారం దోచుకుని వెళ్లేవాడు. మొత్తం హుస్సేన్‌పై 17 కేసులు నమోదయ్యాయి. దరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. హుస్సేన్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అలాగే హుస్సేన్‌కు న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఇక, అరెస్ట్ అయిన హుస్సేన్ ఖాన్ వద్ద నుంచి 90గ్రాముల బంగారం, 45వేల నగదు, మొబైల్ ఫోన్, హోండా యాక్టీవ్ బైక్ సీజ్ చేశామని వెల్లడించారు.