అనారోగ్యానికి గురైన ఓ యువతి స్థానిక మెడికల్ షాప్‌నకు వెళ్తే ఆమెను లైంగికంగా వేధించాడు ఆ కీచక షాప్ ఓనర్. మందులు ఇవ్వమంటే టెస్ట్ చేస్తానని లోపలికి తీసుకెళ్లి అసభ్యంగా తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. హైదరాబాద్‌లోని మోండా మార్కెట్ సమీపంలో సందీప్ యాదవ్(42) గోకుల్ మెడికల్ షాప్ నడిపిస్తున్నాడు. అదే మెడికల్ హాల్‌లో వెనకవైపు క్లినిక్‌లా ఓ రూం ఏర్పాటు చేసి, అనారోగ్యం, అస్వస్థతకు గురైన వారిని పరీక్షించి మెడిసిన్ ఇస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ మెడికల్ షాప్‌నకు ఓ యువతి జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతూ మెడిసిన్ కోసం వెళ్లింది. అయితే టెస్ట్ చేశాకే మందులు ఇస్తానని ఆ యువతిని క్లినిక్‌లోకి తీసుకెళ్లాడు.

యువతిని బెడ్‌పై పడుకోబెట్టిన సందీప్ యాదవ్ ఆమెను పరీక్షిస్తున్నట్లు నటిస్తూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద అసభ్యంగా తాకతూ వికృతంగా ప్రవర్తించాడు. ఆ చర్యలతో షాక్ తిన్న యువతి అతడిని నెట్టేసి బయటకు పరుగులు పెట్టింది. ఇంటికి వెళ్లి రోధిస్తూ కుటుంబ సభ్యులకు మెడికల్ షాప్‌లో జరిగిన దుశ్చర్యను వివరించింది. వెంటనే తల్లిదండ్రులు ఆ యువతితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సందీప్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతడు క్లినిక్ ఎలా నిర్వహిస్తున్నాడని పరిశీలించగా కలకత్తా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభ్యమైంది. అయితే, ఆ పట్టా అసలైందేనా లేక నకిలీదా అని పోలీసులు విచారిస్తున్నారు.