పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనుసూద్‌, శుక్రవారం హైదరాబాద్‌ నగరంలోని ఓ అభిమాని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అనూహ్యంగా పలకరించి తన అభిమానిని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన తార్కంపేట అనిల్‌కుమార్‌.. ప్రకాశ్‌నగర్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. సోనుసూద్‌ స్ఫూర్తితో ఇటీవల తన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పేరును ‘లక్ష్మీ సోనుసూద్‌’గా మార్చి సోను ఫొటో పెట్టారు. పలువురు సోనుసూద్‌ ఫొటోతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. విషయం తెలుసుకున్న సోనుసూద్‌ శుక్రవారం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి అనిల్‌ను ఆశ్చర్యపరిచారు. స్వయంగా గరిట తిప్పి అక్కడున్నవారిని తింటారా అని పలకరించారు.