బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా స్పాల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు స్పా సెంటర్లపై బంజారాహిల్స్‌ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.13లోని మోరా థాయ్‌ స్పాతో పాటు ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మోరా థాయ్‌ స్పా మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఈ స్పా యజమాని విశాల్‌బాయ్‌ మున్సుక్‌ బాయ్‌ గజేరా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు భాగస్వాములు కార్తీక్, అలీఖాన్‌లు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై కూడా దాడులు జరిగాయి. ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

మరోవైపు ఫిలింనగర్‌లోని స్పాలలో గత ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడుల్లో వెల్లడైంది. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే నిర్వాహకులు స్పా కేంద్రాలను వ్యభిచార గృహాలుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్‌ సెక్టార్‌ పరిధిలోని స్పాలన్నీ వ్యభిచార కూపాలుగా మారాయని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి స్పాల వ్యవహారాలపై పోలీసులు విచారణకు ఆదేశించారు.