రంగుల పండగ హోలీ సందర్భంగా ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ తన అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హోలీ పండగ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సతీమణి ప్రణతితో పాటు ఇద్దరు కుమారులు అభయ్‌రామ్, భార్గవ్రామ్లతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన కథానాయకుడు తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తన ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫొటో కావడం, అదీ రంగుల పండగ హోలీనాడు పంచుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపవుతోంది.