ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబం ప్రేమగా పెంచుకునే హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యంతో మరణించటం దానికి వైద్యం చేసిన వైద్యుడి నిర్లక్ష్యమే కుక్క ప్రాణాలు పోవటానికి కారణమంటూ కేసు పెట్టటం దాన్ని రిజిస్టర్ చేయటం జరిగిపోయాయి. ఈ ఉదంతంపై పలువురు నేతలు రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతి తన ఫేస్ బుక్ పోస్టుతో చెలరేగిపోయారు. తీవ్ర ఆవేశానికి ఆగ్రహానికి ఆవేదనకు గురైన ఆమె తెలంగాణలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు తల దించుకుంటున్నట్లు చెప్పారు.

కుక్క ఎపిసోడ్ పై ఫేస్ బుక్ లో విజయశాంతి రాసుకొచ్చిన పోస్టును యథాతధంగా చూస్తే ‘‘తెలంగాణ సీఎం కెసిఆర్ గారి క్యాంపు కార్యాలయంలో కుక్క ప్రాణాలకు ఉన్న విలువ కూడా తెలంగాణ ప్రజలకు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. విషజ్వరాల బారినపడి తెలంగాణలోని అమాయక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఆరోగ్యశాఖ అధికారులపై చర్యలు ఉండవు..

గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పచెప్పి ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు చాలామంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినా దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. కానీ సీఎం కేసీఆర్ గారు – ఆయన కుటుంబసభ్యులు ఎంతో ప్రేమగా పెంచుకున్న హస్కీ అనే కుక్క జ్వరం వచ్చి చనిపోతే మాత్రం చర్యలు మామూలుగా లేవు. ఆ కుక్కకు సరైన విధంగా వైద్యం అందించకపోవడంతోనే మరణించిందనే కారణంతో దానికి చికిత్స చేసిన డాక్టర్ రంజిత్పై ఐపీసీ 429 సెక్షన్ 11(4) కింద – ప్రివెంటివ్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయింది…