విదేశాల్లో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వారు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ తెలంగాణకు చెందిన వారు , అందులోనూ మంచి స్నేహితులు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే: వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన శివదత్తా, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం కొన్నినెలల క్రితం అమెరికా వెళ్లారు. ఇద్దరూ సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నారు. వీకెండ్‌ కావడంతో శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెరువులో సరదాగా ఈత కొట్టడానికి దిగారు. అయితే విపరీతమైన చలి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు బయటకు వచ్చారు. కానీ ఉత్తేజ్‌, శివదత్త మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త మృతదేహాన్ని శనివారమే వెలికితీశారు.

అయితే ఉత్తేజ్‌ మృతదేహం ఆదివారం రాత్రికి కానీ లభించలేదు. కాగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు అనుకోని ప్రమాదంలో చనిపోవడం వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుల మృతదేహాలు త్వరగా స్వదేశానికి చేర్చాలని మృతుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈవిషయాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల మృతదేహాన్ని త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.