రూ.75లక్షలు ఖర్చు చేసి, చలికి గడ్డకట్టి, చివరకు కుటుంబమంతా మృత్యుఒడికి చురుకున్నారు. అమెరికా – కెనడా సరిహద్దులోని ఎమర్సన్ ప్రాంతంలో జనవరి 18న జరిగిన “అక్రమ వలస” ఘటనలో గుజరాత్ కు చెందిన ఒక కుటుంబం మృతి చెందిన ఘటనలో అంతుబట్టని విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుజరాత్ కు చెందిన జగదీష్ కుమార్ పటేల్ (39), అతని భార్య వైశాలిబెన్ (37), వారి కుమార్తె విహంగీ (11), 3 ఏళ్ల కుమారుడు ధార్మిక్ పటేల్, మరికొందరితో కలిసి జనవరి 18న కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో మైనస్ డిగ్రీల చలిని తట్టుకోలేక జగదీష్ కుమార్ పటేల్ కుటుంబం మృతి చెందారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ నిఘా అధికారులు మిగతా వారిని పట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత పది రోజులుగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న కెనడా అధికారులు “పటేల్” కుటుంబం మృతిపై పలు విషయాలు రాబట్టారు. జగదీష్ కుమార్ పటేల్ తన కుటుంబంతో సహా అమెరికాకు వలస వెళ్లేందుకు దాదాపు రూ.75 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. గుజరాత్ లో ధనవంతుడైన జగదీష్ అంత ఖర్చు చేసి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులకు అంతుబట్టడం లేదు.

అప్పటికే వారు కెనడా పర్యాటక వీసాపై ఉన్నట్లు గుర్తించిన అక్కడి అధికారులు పటేల్ కుటుంబం అమెరికాకు ఎందుకు వలస వెళ్లదలుచుకున్నారో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. రూ.75 లక్షలు ఖర్చు చేస్తే నేరుగా అమెరికా వీసా పొందే అర్హత ఉండగా వీరు ఈ అక్రమ మార్గం ఎంచుకోవడం వెనుక ఇతరుల హస్తమేమైన ఉందా అనే కోణంలోనూ కెనడా అధికారులు ఆరా తీస్తున్నారు. “అమెరికా కలే” వీరికి మృత్యు శాపంగా మారిందని చెబుతున్నారు. అమెరికాలో గుజరాత్ పటేల్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటున్నారు. ఈక్రమంలో వారితో కలిసి అమెరికా జీవితాన్ని అనుభవించేందుకే ధనవంతుడైన జగదీష్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కెనడాలోని పటేల్ వర్గీయులు కొందరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కెనడాలోని అత్యంత చలి ప్రాంతం మానిటోబా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన జగదీష్ కుటుంబ సభ్యుల వద్ద మైనస్ డీగ్రీల చలిని తట్టుకునే దుస్తులు కూడా ఉన్నట్లు గుర్తించారు. గుంపులోని మిగతా ఏడుగురు బోర్డర్ దాటడం, జగదీష్ కుటుంబం మాత్రమే మృతి చెందడం పట్ల కెనడా అధికారులు, భారత ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.