నవమాసాలు మోసింది. పాలిచ్చి పెంచింది. చదువులు చెప్పించి జీవితంలో స్థిరపడేలా చేసింది ఆ తల్లి. అయితే కిరాతక కుమారులిద్దరికీ ఆమె మోయలేని భారమైంది. 95 ఏళ్ల వయసులో చరమాంకానికి చేరుకున్న కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా గెంటివేశారు. అమ్మ విలువ తెలియని కుమారులిద్దరూ కూడబలుక్కుని అర్ధరాత్రివేళ నడిరోడ్డుపై పడేసి తలుపులేసుకున్నారు. అరియలూరు జిల్లా జయంకొండం సమీపం సెంగునందపురానికి చెందిన మాణిక్యం, పట్టమ్మాళ్‌ (95) దంపతులకు షణ్ముగం (62), సదాశివం (59) అనే ఇద్దరు కుమారులు, సరోజ (65), శకుంతల (60) అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇద్దరు కుమారులూ కూడబలుక్కుని వృద్దాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారు. అయినా కన్నపేగు మమకారంతో సెంగునందపురంలో పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్న కుమారుల వద్దకు ఒంటరిగా చేరుకుంది. కుమారులు చేరదీస్తారని ఎంతో ఆశగా వచ్చిన ఆమెకు నిరాశేమిగిలింది. అనేకసార్లు తలుపు తట్టగా కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన కుమారులు కసురుకుని మరలా తలుపులకు గడియపెట్టుకున్నారు. ఇక చేసేది లేక ఇలయూరులోని కుమార్తె శకుంతల ఇంటికి చేరుకుంది.

దీంతో శకుంతల భర్త శివగురునాథన్‌ బుధవారం ఆమెను వెంటబెట్టుకుని కుమారులు ఇళ్లకు వెళ్లాడు. అయితే ఇద్దరు కుమారులు ఆమెను లోనికి రానీయలేదు. దీంతో ఏమీచేయాలో పాలుపోని శివగురునాథన్‌ పెద్ద కుమారుని ఇంటి అరుగుపై ఆమెను పడుకోబెట్టి వెళ్లిపోయాడు. ఇది గమనించిన షణ్ముగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ్ముడు సదాశివం ఇంటి అరుగుపై పడుకోబెట్టి తలుపేసుకున్నాడు. సదాశివం సైతం కోపగించుకుని తిరిగి ఆమెను అన్న షణ్ముగం ఇంటి అరుగుపెట్టి వెళ్లిపోయాడు. ఇలా సోదరులిద్దరూ ఆమెను పదేపదే మారుస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేశారు.

ఇక లాభం లేదనుకున్న సోదరులిద్దరూ కూడబలుక్కుని బుధవారం అర్ధరాత్రి వేళ తల్లి పట్టమ్మాళ్‌ను తమ ఇంటి ముందు నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. వృద్ధా్దప్యంతో కదలలేని స్థితిలో చలితో వణుకుతూనే రాత్రంతా రోడ్డుపైనే ఆమె గడిపారు. ఏదో ఊరికి వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వెళుతూ రోడ్డుపై పడి ఉన్న పట్టమ్మాళ్‌ను పన్నీర్‌సెల్వం అనే వ్యక్తి గమనించి జయకొండం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు.

కొద్దిగా కోలుకున్న పట్టమ్మాళ్‌ను తిరిగి ఆటోలో ఎక్కించుకుని వచ్చి కుమారులిద్దరినీ పిలిచి స్థానికులతో కలిసి చర్చలు జరిపాడు. అయితే అమ్మను ఇంట చేర్చుకునే ప్రసక్తేలేదని ఖరాఖండీగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో ప్రజలు ఒక అంబులెన్స్‌ను పిలిచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుమారులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.