అయ్యప్పమాల, ఆంజనేయమాల, గోవిందమాల, శివమాల, ఇలా దేవుళ్ళ మొక్కులకు రకరకాల మాలలు వేసుకునే భక్తుల స్థానంలో ఇప్పుడు సినిమా భక్తులు మొదలయ్యారు. కొత్తగా పవన్ కళ్యాణ్ మాల మొదలయింది. అయితే దేవుడు మాలలకున్న నిబంధనలు కాకుండా, పవన్ కళ్యాణ్ ఆశయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మాల మొదలైంది. అభిమానం హద్దులు దాటడమంటే ఇదే కావొచ్చు. ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పుడు ‘పవన్ మాల’ ధరించి దీక్ష చేపట్టారు. సాధారణంగా ఎవరైనా భక్తులు దేవుళ్ల పేరున మాల వేయడాన్ని చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ‘పవన్ మాల’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విజయవాడకు చెందిన అభిమానులు కొందరు పవన్ 49వ జన్మదినోత్సవం సందర్భంగా ‘పవన్ మాల’ను స్వీకరించి దీక్ష తీసుకున్నారు.

ఇందులో భాగంగా డాలర్‌తో కూడిన మాలలను, ఎర్ర కండువాలను ధరించారు. మెడలో అన్ని మతాలకు చెందిన చిహ్నాలు వేసుకున్నారు. ఈ దీక్ష చేపట్టినవారు 21 రోజులు లేదంటే 41 రోజులు దీక్షలో ఉండొచ్చు. దీక్ష చేపట్టినవారు మండలకాలంలో పవన్ కార్యక్రమాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఎన్నికల్లో ఆయన విజయం కోసం ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, పవన్‌ స్ఫూర్తితో తాము కూడా ప్రజా సేవ చేస్తామని వారు ప్రకటించారు. ‘పవన్ మాల’ దీక్షకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.