ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఊళ్లు. ఆ ఊళ్లల్లో ఉన్నోళ్లంతా పెళ్లి కాని ప్రసాదులే. వారికి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఊళ్లో ఉన్న అమ్మాయిలు కూడా వేరే ఊరి వారిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారే కానీ ఊళ్లో అబ్బాయిలతో తాళి కట్టించుకోవటం నో అంటే నో అనేస్తున్నారు. దీంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. అలా అని వారికి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి లోపం లేదు. మరి వారికి ఎందుకు పిల్లను ఇవ్వటం లేదు? ఇంతకూ ఈ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ నాలుగు ఊళ్లు ఎక్కడ ఉన్నాయన్న విషయంలోకి వెళితే:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని ఢిల్లీ హైవేకి పక్కనే ఉన్న బదువాపూర్ పన్కీపడకా జుమాయి సరయమిత్ర అనే నాలుగు ఊళ్లకు చెందిన కుర్రాళ్లకు పెళ్లి అన్నదే కావటం లేదు. ఆ ఊళ్లకు పిల్లను ఇచ్చేందుకు సమీప గ్రామాలకు చెందిన వారెవరూ ముందుకు రావటం లేదు. కారణం ఆ ఊళ్లకు సమీపంలోని మున్సిపాలిటీ డంపింగ్ యార్డు ఉండటమే.

యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో ఆయా గ్రామాల ప్రజలు జబ్బున పడటంతో పాటు భరించలేని దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వివిధ రకాలైన వ్యాధులకు గురి అవుతున్నారు. దీంతో ఈ గ్రామాల్లో కుర్రాళ్లకు పిల్లల్ని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. డంపింగ్ యార్డ్గ్ గబ్బు కారణంగా వస్తున్న వ్యాధులతో విలవిలలాడుతున్న పలువురు బంధుత్వాల్ని సైతం తెంచేసుకుంటున్నారు. ఇలా.. నాలుగు ఊళ్ల ఉసురు తీస్తోంది డంపింగ్ యార్డ్.