ప్రీవెండ్డింగ్ షూటింగ్ ముచ్చట ఓ ఎస్సైని ఇబ్బందుల్లోకి నెట్టింది. కాబోయే భార్యతో పోలీస్ యూనిఫామ్ లోనే అతడు ప్రీవెడ్డింగ్ షూట్ స్క్రిప్ట్ సరిగా లేక ఇబ్బంది పడిపోయాడు. పెళ్లి కూతురు స్కూటీమీద రావడం, ఎస్సైగా ఉండే పెళ్లి కొడుకు ఆమెను ఆపడం, లైసెన్స్ అడగడం, లైసెన్స్ లేదని ఆమె అతడి జేబులో లంచంగా డబ్బు పెట్టడం, ఆ డబ్బు పెడుతూ అతడి పర్సు కొట్టేయడం, ఆ తర్వాత ఇద్దరూ హోటల్ లో కలుసుకోవడం, చూపులు కలవడం, పెళ్లి జరగడం ఇదీ ప్రీవెడ్డింగ్ షూట్ స్క్రిప్ట్.

అంతా బాగానే జరిగినా పోలీస్ అధికారిగా ఉండి, పోలీస్ డ్రస్ లో ఇటువంటి పిచ్చి పనులు చేయడం మంచిది కాదంటూ ఉన్నతాధికారులు మందలించి, షోకాజ్ నోటీసులు జారీ చేయడం కొసమెరుపు. దీంతో పాపం పెళ్లి సంబరం మూడు ముళ్లకు ముందే నీరు కారింది. రాజస్తాన్ రాష్ట్రంలోని చిత్తోర్ ఘర్ జిల్లా మాండ్ఫియా పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఉన్న ధన్ పత్, కిరణ్ లకు వివాహం జరగాల్సి ఉంది.

ఇప్పుడు పెళ్లి వీడియో కంటే ప్రీవెడ్డింగ్ షూట్ లకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఈ స్క్రిప్ట్ తో ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. షూటింగ్ అయితే బ్రహ్మాండంగా సినిమా స్టైల్ లో ఉంది కానీ, పోలీస్ అధికారిగా ఉండి, పోలీస్ డ్రస్ లోనే కాబోయే పెళ్లి కూతురుతో ఇలా షూటింగ్ లో పాల్గొనడం, లంచం తీసుకున్నట్టు నటించడం, తన పర్సు ఆమె కొట్టేయడం ఇలాంటివన్నీ పోలీస్ ప్రతిష్ట దిగజార్చేటివని, పోలీస్ ప్రవర్తనా నియమావళిక విరుద్ధమని పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రీవెడ్డింగ్ షూట్ కాస్తా వీపింగ్ షూట్ గా తయారైంది.