భర్తపై కక్ష తీర్చుకునేందుకు ఓ కసాయి తల్లి కూతురినే ఎరగా వాడింది. కన్న కూతురిపై తన భర్తే లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడంటూ తప్పుడు ఆరోపణలు పెట్టి చిక్కిపోయింది. దీంతో హైకోర్టు భర్తపై పెట్టిన పోక్సో చట్టం కింద పెట్టిన కేసుని ఆమెపైకే మళ్లించి జైలుకి పంపారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకు ఇదో హెచ్చరిక కావాలని మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చెన్నైకి చెందిన 11ఏళ్ల బాలికపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందంటూ చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు ఆమె భర్తపై పోక్సో చట్టంకింద కేసు పెట్టి జైలుకు పంపారు. ఈ కేసు కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయానికి కేసు కీలక మలుపు తిరిగింది. ఎగ్మూర్ లోని ఫ్యామిలీ కోర్టులో బాలిక ఇచ్చిన సాక్ష్యం తల్లి కిరాతకానికి ఒక నిదర్శనం. తన తండ్రి తనపై ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదని, తాను గర్భందాల్చానన్న మాట అబద్ధమని, ఇవన్నీ తండ్రిపై కక్ష తీర్చుకునేందుకు తన తల్లే తప్పుడు ఆరోపణ చేసిందంటూ ఆ బాలిక భోరుమని విలపిస్తూ న్యాయమూర్తికి చెప్పింది.

ఈ విషయం విన్న హైకోర్టు న్యాయమూర్తి ఆ బాలికను పిలిపించి అసాధారణ రీతిలో తానే స్వయం ఆ బాలికను విచారించారు. తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లి చేసిన ఆరోపణలు నిజం కాదని ఆ బాలిక ఒప్పుకుంది. దీంతో కేసుని కొట్టివేస్తూ న్యాయమూర్తి అదే కేసు తల్లిపై పెట్టాలని తీర్పు చెప్పారు. భర్తపై కక్షసాధించడంకోసం కన్నకూతురిపైనే దారుణమైన ఆరోపణ చేసే మనసు కన్నతల్లికి ఎలా వచ్చిందో అర్థంకాని విషయం అని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.