ఈ ట్రక్కులో 2 వేల కోట్లు డబ్బు- గేర్ పనిచేయక ఆగిపోయింది

రూ.2 వేల కోట్ల నగదుతో బయలుదేరిన కంటైనర్‌ లారీ ఒకటి రిపేర్‌ కారణంగా చెన్నైలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. విషయం తెల్సుకున్న స్థానికులు ఆ లారీని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటన గురువారం చెన్నైలో జరిగింది. మైసూరులోని రిజర్వు బ్యాంకు ముద్రాణాలయం నుంచి రూ.2 వేల కోట్ల నగదుతో నింపిన కంటైనర్‌ లారీ రిజర్వ్‌బ్యాంకు చెన్నై కార్యాలయానికి గురువారం బయల్దేరింది. రాత్రి 7.30 సమయంలో అమింజికరై, పుల్లా ఎవెన్యూ సిగ్నల్‌ గుండా వెళ్తున్నపుడు గేర్‌ బాక్సులో సమస్య తలెత్తి రోడ్డుపై ఆగింది. వెంటనే లారీకి భద్రతగా వస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF సిబ్బంది అక్కడికొచ్చారు.

వేలకోట్ల నగదు ఉన్న లారీ ఆగిందనే విషయం తెల్సుకున్న స్థానికులు అక్కడ గుమిగూడారు. ఇంతలో రిజర్వ్‌బ్యాంకు అధికారులు, స్థానిక పోలీసులూ వచ్చారు. చివరకు మెకానిక్‌ వచ్చి సమస్యను సరిచేశాడు. దీంతో లారీ దాదాపు నాలుగు గంటలు అక్కడే నిలిచిపోయింది. ఎట్టకేలకు రాత్రి 11.30 గంటల సమయంలో చెన్నై రిజర్వు బ్యాంకుకు బయల్దేరింది.