దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులపై హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కొన్ని వర్గాలు, కొందరు రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మరక్షణలో భాగంగా ఎన్‌కౌంటర్‌ సరైందే కానీ.. నిందితులకు చట్టపరంగా శిక్ష పడితే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని అన్నారు కేంద్ర మంత్రి మేనకాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రీడాకారిణి గుత్తా జ్వాల.

ఎవరెవరు ఏమన్నారంటే:

‘చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేరం రుజువైన తర్వాత నిందితులకు తప్పకుండా ఉరిశిక్ష పడేది: కేంద్ర మంత్రి మేనకా గాంధీ
‘నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడల్లా ప్రజల్లో ఆక్రోశం పెరుగుతోంది. అందుకే ఎన్‌కౌంటర్‌ గురించి తెలియగానే హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రజలు క్రిమినల్‌ న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారు: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

నిందితులకు మరణశిక్షే మేం కోరుకున్నది. అయితే అది న్యాయపరంగా జరిగితే బాగుండేది. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందో తెలియదు. అది పోలీసులు మాత్రమే చెప్పగలరు’- జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ‘ఈ చర్య భవిష్యత్‌లో మహిళలపై దారుణాలను ఆపగల్గుతుందా?. మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి రేపిస్టును ఇలాగే శిక్షిస్తారా?’ గుత్తా జ్వాల