• భారతదేశం అత్యధిక స్థాయిలో స్తీ దేవతలని పూజి0చే దేశం , అంటే మన గ్రామ దేవతలైన ‘పోషమ్మ మైసమ్మల’ నుండి మొదలు పెడితే తిరుపతి పద్మావతి అమ్మవారి వరకు నిత్యం పూజిస్తూనే ఉంటాం ఆఖరికి గోవులని కూడా తల్లులుగా “గోమాతాగా “పూజించుకుంటూనే ఉన్నాం .
  • అంతవరకు బాగానే ఉన్నా, ఆడవారి మీద నిత్యం ఏదో ఒక చోట వేధింపులు ,అత్యాచారాలు జరుగుతుండటం చాలా బాధాకరమైన విషయం
  • ఇక్కడ గమనించ దగిన విషయం ఏమిటంటే
  • అత్యాచారాలకు గురయ్యే వారు పసి పిల్లల నుండి మొదలు కొని పండు ముసలి వారి వరకు ఉండటం
  • ఈమధ్య నెలల పసిపాపల పట్ల కొంతమంది అఘాయిత్యాలకు ఓడిగట్టి మానవత్వాన్ని నామరూపాలు లేకుండా సజీవ దహనం చేస్తున్నారు
  • మహిళల పట్లనే కాకుండా అక్కడక్కడ మగవారి మీద ఆడవాళ్లు, ఆడవాళ్ళ మీద ఆడవాళ్లు, ట్రాన్సజెండర్స్ మీద మగవాళ్ళు ఇలా అఘాయిత్యాలకు, దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.
  • గమ్మత్తేమిటంటే మనకి తెలిసే వాటి కన్నా తెలియనివే ఎక్కువ చాలా వరకు కులం,డబ్బు ,లోకల్ పంచాయితీల మూలాన బయటి ప్రపంచానికి తెలియకుండా పోతున్నవి
  • పలానా మతం అనో ,పలానా కులం అనో కొన్ని కొన్ని మాత్రమే బయటకి వస్తున్నాయి
  • ప్రియాంక ఘటనకు వారం రోజుల ముందు ఆసిఫాబాద్లో ఆ తర్వాత వరంగల్ లో అత్యాచారాలు జరిగిన సంగతి మనకి తెలిసిన విషయమే
  • కాకపోతే ప్రియాంకా రెడ్డి డాక్టర్ కావడం వల్లనో .??, లేక హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఇలాంటి ఘటన జరగడం వలనో అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసింది, సంఘటన తర్వాత అన్ని న్యూస్ ఛానెల్స్ లైవ్ అప్డేట్స్ ఇవ్వడం, మళ్లీ మళ్లీ రిపీటెడ్గా రోజుల తరబడి ప్రసారం చేస్తూనే ఉన్నాయి.

హైద్రాబాద్ లాంటి సిటీస్ లలోనే భద్రత మహిళలకు లేకపోతే చిన్న చిన్న పట్టనాలు, గ్రామాల్లోని మహిళలకి రక్షణ ఎవరు ఇస్తారని అడిగే వారు కూడా లేకపోలేదు
గతంలో వరంగల్లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రణీత, స్వప్నిక ల మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు నిందితులను అప్పటి వరంగల్ ఎస్పీ నేడు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ఎన్కౌంటర్ చేసి ప్రజల్లో కొంచెం విశ్వసనీయతని పెంచారు, నిందితులకు సరైన శిక్ష వేశారని అందరూ సంతోషించారు. ఆ తర్వాత కూడా మన దేశంలో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అప్పట్లో ఆయేషా మీరా, ఢిల్లీలో నిర్భయ , ఆసిఫా, తర్వాత గీత, మొన్న ఆసిఫాబాద్,నిన్న వరంగల్ వరకు నేడు ప్రియాంకా రెడ్డి వరకు వచ్చాయి

దేశంలో ఏ మూలనో ,మన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం నిందితులని శిక్షించాలని కోరడం సబభే కానీ మనం ప్రభుత్వాన్ని ముఖ్యంగా దేశవ్యాప్తంగా అత్యున్నతమైన పేరుని తెచ్చుకున్న “ఫ్రెండ్లీ పోలీసింగ్ “బ్రాండ్ గా ఉన్న మన పోలీసు వ్యవస్థని దీనికి భాద్యులుగా చేసి మనమంతా చేతులు దులుపుకోవడం సరైన పని కాదు. పైగా ప్రస్తుతం పోలీసు వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తున్నా వారి పని గంటలకి మించి తమ శ్రమని ఉద్యోగానికే వెచ్చిస్తున్నారు . దీనిని కూడా మనం గుర్తించాలి. మన చుట్టూ అన్యాయం జరిగినపుడు పోలీసులు స్పందించక ముందే మనం కూడా డ్రెస్ లేని పోలీసులమే అన్న బాధ్యతతో స్పందించాలని చాలా వరకు పోలీసులు మనకి నిత్యం అవగాహన కల్పిస్తున్నారన్న విషయం మరవొద్దు.

నిజంగా మనదేశం కన్నా కఠిన చట్టాలను అమలు పరిచే అరబ్దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ కొరియా , ఇతర దేశాలలో కూడా పసిపిల్లలు, మహిళలపై అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి, సంఘటన జరిగిన వెంటనే అక్కడి ప్రభుత్వాలు నిందితులకు బహిరంగంగా శిక్షను విధిస్తున్న మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం , మనం ఎప్పుడూ కూడా సంఘటన జరిగిన తీరుని, సంఘటన పరిధిని విశ్లేషించుకుంటాము కానీ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమి చేయాలో ప్రజలు ,అటు స్వచ్చంధ సంస్థలు, ప్రజాసంఘాలు తమ పరిధి దాటి పని చేయలేరు, అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో ఎక్కువ వెనుక బడే ఉన్నాయి. వీలైనన0త వరకు సినిమాల్లో పోర్న్ ని,పోర్న్ సైట్స్ ని నిషేదించాలి. మనం పాశ్చాత్య సంస్కృతి గా భావించే అమెరికాలో కూడా వివిధ పోర్న్ సైట్స్ పై నిషేధం ఉంది.

ఇక ప్రియంకారెడ్డి విషయానికి వొస్తే

ఆమె ఒక ఉన్నతకుటుంభం నుండి వొచ్చిన అమ్మాయి, ఉన్నత చదువులు చదివిన విద్యావంతురాలు, ఒక ప్రభుత్వ పశు వైద్యురాలు ,ఆమెని తల్లిదండ్రులు చాలా బాధ్యతగా పెంచారు.
కానీ ఆమెకి సమాజం పట్ల ఆమె చదువుకున్న విద్యా సంస్థలో, తల్లిదండ్రులో,తన చుట్టూ ఉన్న సమాజం ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని మాత్రం నేర్పివ్వలేదు .
ఫోన్లో తన చెల్లి టోల్ గేట్ దగ్గరకి వెళ్లమని వారించిన తాను ఆడపిల్లనని, అందరూ చూస్తారని భయంగా ఉంటుందని మాట్లాడిన తీరుని గమనిస్తే మన పితృస్వామ్యా వ్యవస్థే ముఖ్యంగా ఆడవారి పట్ల మన మగవాళ్ళు స్పందించే విధానం,ఆడవారిమీద వివక్షే దీనికి కారణంగా నేను భావిస్తున్నాను .

తనలో తనకి తెలియని అభద్రతభావాన్ని కల్పించిన ఈ సమాజం , ఈ వ్యవస్థ కూడా ఘటనలో భాగస్వామ్యం అని నేను భావిస్తున్నాను. ఇక పోలీసులకి తాను సమాచారం ని అందిస్తే బాగుండు కనీసం ఆమె పోలీసులకి సమస్య తెలిపిన నిందితులు బయపడి ఉండే వారేమో..??
ఆమె అభద్రత భావాన్ని తనకి తానే కల్పించుకొని భయం భయంగా ఉండటం వల్లె నిందితులు ఈ దారుణానికి ఓడిగట్టి ఉంటారేమో..?? ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్ని వెంటాడుతునే ఉన్నాయి.

అప్పట్లో థాయిలాండ్ లో పసి పిల్లలు దాదాపు 12మంది గుహలో ఇరుక్కుని పోయి వారంరోజులు తరువాత ప్రాణాలతో బయట పడటo విధితమే అక్కడ పిల్లల గురువు వారికి దైర్యాన్ని నింపడం వలనే కేవలం గాలి మాత్రమే పీల్చుకుని ధైర్యమే ఊపిరిగా సజీవంగా బయటకి రాగలిగారు
“మన విద్యా వ్యవస్థ పిల్లలని యంత్రాలుగా మారుస్తోంది కానీ యంత్రాలని తయారుచేసేలా వారిని తీర్చిదిద్దటం లేదు’ లోపభూయిష్టంగా విద్యావిధానం ఉంది, దానిని మార్చాలి
మన దేశ గౌరవాన్ని , సంస్కృతి ,సాంప్రదాయాలని ,నీతి సూత్రాలని ప్రతిబింబించేలా సిలబస్ ని రూపొందించాలి.

నిందితుల విషయానికి వొస్తే అందరూ రెండు పదులకి మించని వారే. వాళ్ళు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వొచ్చి పని చేస్తున్నారో కారణం అవి ఇవి నేను విశ్లేషించలేను.. వారు మద్యం తాగి ఈ ఘటనకు పాల్పడ్డారని ,మధ్య నిషేధం జరుగుతనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఉద్యమించే వాళ్ళని కూడా నమ్మను కారణం అన్ని ఘటనలు మద్యంతో ముడి పెట్టలేము,అన్ని ఘటనలకి మద్యం కారణం కాదు. మనము సందర్భాన్ని బట్టి ప్రవర్తించే విధానమే మనల్ని ముందుకు వెనక్కి తీసుకెళ్తుంది. అది నిందితులనైనా, బాధితులనైనా .

నిందితుల తల్లులు అందరూ తమ బిడ్డలకు ఉరి శిక్షను వేయమని కోరడం కూడా సబబు కాదు, యుక్త వయస్సు వచ్చినా కూడా సమాజం పట్ల బాధ్యతని నేర్పని తల్లులది తప్పు కాదా ?? అని నేను అడగను. మన దేశ యువకులు సీంగపూర్
మలేషియా దేశాలకి వెళ్ళినప్పుడు అక్కడి మహిళలు ఈసడి0చు కోవడానికి కారణం మన మగవాళ్ల అతియే కారణం ,ఏ ఒక్కరో ఇద్దరో చేసిన పనుల వలన దేశంలోని మగవాళ్ళని ఒకేలా జతకట్టి పడేయడం జరగడం ములానా మన దేశ పురుషుల వలన అభద్రత వారికి అనే ఫీలింగ్ కలుగుతుంది.తద్వారా మన దేశ పురుషుల మీద ఆ దేశాల అమ్మాయిలకు పూర్తిగా నమ్మకం పోతుంది.

ఒక అనుకోని సంఘటనలు, విపత్కర పరిస్థితికి మనకి కలిగినపుడు మనం వాటిని ఎలా దాటి బయట పడాలో తెలియక పోవడం వల్లనే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలకి చిన్నప్పటినుండే ఆత్మ రక్షణకి కరాటే ,కు0గ్ఫు లలో తర్ఫీదు ఇస్తూనే ,సమాజం పట్ల ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షత లేని సమాజంగా పిల్లలని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది. అంతే కాకుండా యుక్త వయసుకి వచ్చిన యువతకి “సెక్స్ ఎడ్యుకేషన్ ” పట్ల అవగాహన ఉండాలి . ప్రభుత్వం చొరవ తీసుకుని అయినా సెక్స్ ఎడ్యుకేషన్ ని ఉన్నత విద్యలో తప్పని సరిగా ప్రవేశ పెట్టాలి,. Gender -iniquality ని తగ్గించే విధంగా చర్యలు ఉండాలి. ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఆధిపత్యం ఉండాలి అని చెప్పే నేటి మైదాన సమాజ వ్యవస్థ కన్నా ఆడవాళ్ళని గౌరవిస్తూ , బహు భార్యత్వాన్ని కలిగి ఉన్న గిరిజన సమాజపు మాతృత్వ వ్యవస్థ మిన్న ! ఎందుకంటె అక్కడ ఎక్కువ అత్యాచారాలు , హత్యలు, జరగవు.

అడవుల్లో ఒంటరిగా వారి వారి సంప్రదాయ దుస్తులు జాకెట్ దరించకున్నా అక్కడి ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, అదే మైదాన ఆధునిక వ్యవస్థలో మనం మన ఆడబిడ్డలు పూర్తి సంప్రదాయ దుస్తులు, చీరకట్టుతో
ఉన్నా అత్యాచారాలు జరుతున్నాయి. ఎందుకంటే ఆదివాసి సమాజంలో మన మైదాన ఫ్యూఢల్ వ్యవస్థ వలే స్త్రీ వ్యక్తిగత ఆస్తి కాదు. మన పెట్టుబడిదారి , కార్పోరేట్ సమాజం వలే స్త్రీ వ్యాపార వస్తువు , వ్యాపారం కాదు. ఇది అర్థం కావాలంటే మన కుటుంబాలలో ఆదివాసీ, కమ్యూనిస్ట్ మరియు మూలవాసీ భారతీయ బౌద్ధ స్త్రీ పురుష సమాన సంస్కృతిని మన ఆచారాలలో, పండుగలలో, కుటుంబాలలో ” కుటుంబ ప్రజాస్వామ్యం విలువలు ” గా మనం పాటించాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవం ఏ మతంలోనైనా స్త్రీని తక్కువగా చేసి చూపే కథలని , అంశాలని, పండుగలని మార్చివేయాలి, విడనాడాలి. అలా మూలాలలో మార్పు చేయకుండా భర్తగా, పురుషుడిగా స్త్రీని అన్ని కోణాల్లో, అన్ని దినాలలో అణచివేస్తూ, పాశవికంగా సుఖాలని అనుభవిస్తూ మన బిడ్డల మీద జరగగానే ఏడ్వడం చూస్తే అసలు దోషులమైన మనమే కన్నీరు కార్చినట్లుంది.
ఇక సంఘటనలు నిత్యం జరుగుతున్నప్పుడు ఒక్క సంఘటనను ఒకలా మరొకటి మరోలా చూడటం మానేసి అన్ని సంఘటనలు ఒకేలా చూడాలి, బాధితుల పక్షానా నిలబడాలి, నిందితులకు శిక్ష వేయడం కోర్టుల వంతు, అసలు నేరాలు జరగకుండా సమాజం ఉండకపోవచ్చు, కానీ నేరాల తీవ్రతని మాత్రం మనమంతా అలెర్ట్ గా ఉండి తగ్గించుకోవచ్చును. ప్రమాదంలో చిక్కుకుంటే ఎవరిని సంప్రదించాలోఅన్న అవగాహనని మనమంతా పెంచుకోవాలి. సమస్యని సమస్యగా చూద్దాం ఉన్నత కులం ,నిమ్న కులం , మతం అని సమస్యని చూడొద్దు. సమస్య తీవ్రత ఏ కులానికైనా ఒకేలా ఉంటుంది అది ప్రాంతాన్ని బట్టి మారదు. అది హైద్రాబాద్ అయినా ఆసిఫాబాద్ అయినా..!
అత్యాచారాలకి దుస్తులని ముడి పెట్టడం మానేసి మన వ్యవస్థని నిందించడం మానేసి , మన కుటుంబాలలో లింగ వివక్షతకి తావులేకుండా,
నా సమాజ0 నా బాధ్యత అని ,సమాజం పట్ల గౌరవాన్ని,బాధ్యతని పెంచే విధంగా మనం మెదలుతూ మన సంస్కృతిని, సంప్రదాయాలని రక్షించినపుడే మంచి సమాజాన్ని దేశాన్ని నిర్మించిన వారమవుతాము.