జుట్టు పెరగటానికి, నిగనిగలాడటానికి ఐరన్‌ ఎంతో మేలు చేస్తుంది. ఇది తగ్గిపోతే జుట్టు రాలిపోవచ్చు. వెంట్రుకలు ఊడటంతో పాటు గోళ్లు పెళుసుబారటం, చర్మం పాలి పోవటం, ఆయాసం, బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవటం వంటివీ కనబడితే ఐరన్‌ లోపించిందనే అనుకోవచ్చు.

  • ప్రోటీన్‌ లోపించినా జుట్టు ఊడిపోవచ్చు. ప్రోటీన్‌ లోపించినపుడు మొదట్లో జుట్టు పెరగటం ఆగిపోతుంది. ఆ తర్వాత క్రమంగా ఊడిపోవటం మొదలవుతుంది. మాంసం, గుడ్లు, చేపలు, బాదం వంటి గింజపప్పులు, విత్తనాలు, చిక్కుళ్లు తీసుకోవటం ద్వారా ప్రోటీన్‌ లోపించకుండా చూసుకోవచ్చు.
  • కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి మూలంగా మన రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పొచ్చు. ఇది పొరపాటు వెంట్రుకల కుదుళ్ల మీదే దాడిచేయొచ్చు. ఫలితంగా జుట్టు ఊడిపోవచ్చు. తీవ్రమైన బాధ, ఆందోళన మూలంగానూ జుట్టు పెరగటం నెమ్మదిస్తుంది. దీంతో దువ్వినపుడు తేలికగా వెంట్రుకలు ఊడివచ్చే ప్రమాదముంది.
  • పొగ తాగటం జుట్టుకూ హానికరమే. సిగరెట్‌ పొగలోని విషతుల్యాలు వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తాయి. జుట్టు పెరిగే ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. కాబట్టి పొగ అలవాటుకు దూరంగా ఉండటం ఉత్తమం.