తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన రేవంత్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన హైదరాబాద్‌లోని ‘మల్కాజ్‌గిరి’ నుంచి కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో టీఆర్ఎస్ హవాలోనూ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి నిలిచారు..

రాజీనామా

రాహుల్ స్పూర్తితో పనిచేస్తా! రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడంతో అంతకుమునుపు తనకున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ భవిష్యత్‌ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానన్నారు. పార్టీలో పదవి లేకపోయినా కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. యువరాజు రాహుల్‌ స్ఫూర్తితో రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.