ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఐలవ్‌యూ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం: ఫిరోజాబాద్‌కు చెందిన యువతి(24)తో కానిస్టేబుట్‌ అమిత్‌ యాదవ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతిని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని అమిత్‌ తెలిపాడు. ఈ క్రమంలో కాబోయే భర్తే కదా అని ఆమె శారీరకంగా దగ్గరైంది. కాగా, పెళ్లి విషయం ఎత్తగానే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు అమిత్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడుగగా 2021లో పెళ్లి చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు.

కానీ, కట్నం కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్‌ను నిలదీయగా అదనపు కట్నం కావాలని కోరినట్టు తెలిపింది. ఈ సందర్బంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ: ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేసింది. అతని కుటుంబం రూ. 14లక్షల కట్నం డిమాండ్ చేసింది. అమిత్‌తో నా వివాహం ఆగస్టు 2021కి నిర్ణయించారు. కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ. 19 లక్షల ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుకు తెలపడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫిరోజాబాద్ రూరల్ ఎస్పీ రణ్‌విజయ్ సింగ్ వెల్లడించారు.