బెంగుళూరు: నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీర్‌ కుటుంబం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య, కుమార్తె మృతదేహాలు లభ్యం కాగా ఇంజినీర్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా సాగరహళ్లి గేట్‌ వద్ద చోటు చేసుకుంది. కే.బీ.క్రాస్‌ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రమేష్‌(55) తుమకూరు నగరంలోని రింగ్‌ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. భార్య మమత(46), కుమార్తె శుభ(25)తో కలిసి గురువారం సాయంత్రం కారులో గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలో ఉన్న సాగరనహళ్లి గేట్‌ వద్దకు చేరుకున్నారు.

అక్కడే కారు నిలిపి ముగ్గురూ హేమావతి కాలువలో దూకారు. రాత్రి 8.30గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి పరిశీలించగా మృతులను మమత, శుభగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే రమేష్‌ కూడా కాలువలోకి దూకినట్లు తెలుసుకొని గాలింపు చేపట్టారు.