ఆయన జిల్లా ఉన్నతాధికారి, పిల్లలతో మాట్లాడినప్పుడు బాల్యం జ్ఞాపకాల దొంతర్లలోకి వెళ్లిపోతారు. యువతకు దిశానిర్దేశం చేయాల్సి వస్తే వివేకానందుడిలా స్ఫూర్తినింపుతారు. మహిళలనుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఆప్యాయతను గుర్తుతెచ్చుకుని అందంగా వర్ణిస్తారు. ఆటపాటల వేళ, అధికారిననే మాటే మర్చిపోతారు, అందరితో కలిసిపోతారు. ఇవీ జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా గురించి నాలుగు మాటలు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఆయన న్యూస్-టుడే తో సరదాగా కాసేపు మాట్లాడారు. తన మనసులో మాటలను ఇలా చెప్పుకొచ్చారు.

ఐఏఎస్‌ అయ్యానిలా:

‘ఎక్కువ మంది ప్రజలకు సేవచేయడానికి ఉన్న ఏకైక ఉద్యోగం IAS‌ మాత్రమే, స్వాతంత్య్ర సమరయోధుడైన మా గ్రాండ్‌ఫాదర్‌ చెప్పిన ఈ మాట నామీద బలమైన ముద్రవేసింది. కాకుంటే కాస్త భయం. నేను పాస్‌ అవుతానా.? అనే భయంతో వాయిదా వేసుకుంటూ వచ్చా. అందుకే ఇంజినీరింగ్‌లో చేరా, బిట్స్‌పిలానీలో కంప్యూటర్‌సైన్స్‌ చదివా. బెంగళూరు, పూణేలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశా, ఇవేవీ నచ్చలేదు. తర్వాత సివిల్స్‌ రాయాలనుకున్నా. మళ్లీ భయం వేసింది అప్పుడు క్యాట్‌రాసి అహ్మదాబాద్‌లో ఐఐఎంలో చేరా ఎన్ని వాయిదాలు వేసుకున్నా ఐఏఎస్‌ సాధించాలనే కోరిక మాత్రం తగ్గలేదు.

ఐఎఎంలో చేరాక నాలో చాలా మార్పు:

జీవితమంటే ఏంటో అక్కడే తెలిసింది ఐఎఎంలో చేరాక నాలో చాలా మార్పు వచ్చింది. జీవితం అంటే ఏమిటి, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నైతిక విలువలు, ఇతరులు చేసే పనికి విలువ ఇవ్వడం, ఒకరు చేసిన పనిని మనదిగా చెప్పుకోకూడదు, ఇలా అనేక రకాల మార్పులకు ఇది వేదికైంది. ప్రయత్నం చేయకపోవడం నేరంతో సమానం కలెక్టర్‌గా చాలా సవాళ్లుంటాయి. ఒత్తిళ్లూ ఉంటాయి. అన్నీ ఉన్నాయని భయంతో ఏదీ చేయకుండా ఉండటం నా దృష్టిలో నేరంతో సమానం. చేతులు కట్టుకుని కూర్చొంటే ఏదీ జరగదు ప్రయత్నలోపం లేకుండా ప్రజలకు చేయాలనుకున్న పనుల విషయంలో చిత్తశుద్ధితో చేసుకుంటూ ముందుకుపోవాలనే సిద్ధాంతంతో పనిచేస్తుంటా. ఏ అధికారి అయినా తనకున్న బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూడకూడదు. అది ఏ రంగమైనా సరే సమస్యలున్నాయని, ఎవరూ సహకరించలేదని తిట్టుకుంటూ ఉండటాన్ని నేను ఒప్పుకోను. తన పరిధిలో చేయగలిగిన పని చేసుకుంటూ పోవాలి. ఫలితం అదే వస్తుంది..

దినచర్య ప్రారంభమిలా:

ఉదయం 6 గంటలకు దినచర్య ప్రారంభమవుతుంది. వారంలో ఒకటి రెండు రోజులు బ్యాడ్మింటన్‌ ఆడతా. ఉదయం గంటపాటు పేపర్లు చదువుతా. ఆ తరువాత 7:30 నుంచి ఫోన్లు వస్తాయి. అవన్నీ చూసుకుని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎన్ని పనులున్నా ఉదయం 8:15 గంటలకు కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతా.

చాలా అందంగా ఉంది:

మావారు ఇంట్లో ఉన్నంత సేపు సమయం మాకే కేటాయిస్తారు. అధికారిక విషయాలేవీ మేం ఇంట్లో మాట్లాడుకోం. ఈ జిల్లా చాలా అందంగా ఉంది. మంచి జిల్లా. కలెక్టర్‌గా ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చాక మాకు క్వాలిటీ టైం ఇస్తారు. పాపతో ఆడుకుంటూ ఇంట్లో సందడిగా ఉంటారు.

శ్రేయ, కలెక్టర్‌ భార్య- కలెక్టర్‌ కావాలని అప్పుడనుకున్నా: 

ప్రతి అధికారి తాను ప్రభుత్వ ఉద్యోగి అనుకుంటే, ప్రజల పన్నులతో జీతం తీసుకుంటున్నామని గుర్తించుకుని, వారి కోసం పనిచేయాలి. అది నా విధానం. నేను సివిల్స్‌లో ఐఎఎస్‌ సాధించాక శిక్షణ కోసం వెళ్లేటప్పుడు మార్గమధ్యలో ముజఫర్‌నగర్‌ బైపాస్‌ విస్తరణ పనులు జరుగుతున్నాయి. నాలుగులైన్ల రోడ్డుపనులు కొంత చేశారు కొంత వదిలేశారు. అప్పుడు అనుకున్న నేను కలెక్టర్‌గా ఉంటే గుత్తేదారు మెడలు వంచి ఇచ్చిన గడువులోగా ఆ పని చేయించేవాడినని.

ఇంట్లోకి ఆఫీసు వ్యవహారాలు తీసుకురాను
నా కూతురు పేరు మైత్రేయి. పాప పుట్టాక నాలో కోపం తగ్గింది. గతంలో కోపం ఎక్కువగా ఉండేది. నా భార్య శ్రేయ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో PHD చేస్తోంది. ఆఫీస్‌ వ్యవహారాలు ఏవీ ఇంట్లోకి తీసుకురాను. ఒకసారి ఇంట్లోకి అడుగుపెడితే ఇక పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తా. బయట జరిగిన ఏ విషయం కూడా ఇంట్లో చర్చించుకోం.

లక్షల మంది ప్రజలకు నేను సేవచేయాలి:

ఇంతమంది ప్రజలతో సంబంధం ఉన్న నేను ఒత్తిడికి లోనైనా, మరే ఇబ్బందిపడినా నా సేవలను సవ్యంగా ప్రజలకు అందివ్వలేను. నా కుటుంబంతో ఎలా ఉంటానో ప్రజల సేవల విషయానికి వచ్చే సరికి అంతే ప్రేమతో సేవ చేస్తా. వినతులు తీసుకుని సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ప్రజలకు మా నుంచి ఓదార్పు కావాలి. వారిని కసురుకుంటే ప్రయోజనం ఉండదు. అందుకని చిన్నారులు, బలహీనవర్గాల ప్రజలు సమస్యలు చెప్పుకొనేందుకు వస్తే వారికి అత్యంత ప్రాధాన్యమిస్తా.