వరంగల్‌: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మనోజ్ కుమార్, ఎచ్.ఎస్.సోది (వి.పి – బిజినెస్ ఆపరేషన్స్), తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారిని డా.శాంత తౌటం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో నిర్మించనున్న కైటెక్స్ కంపెనీ పురోగతి, పలు అంశాలపై ఎమ్మెల్యే వారితో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ: వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో మంచి పేరున్న కైటిక్స్ గార్మెంట్స్ కంపెనీ ఏర్పాటు కావడం ఎంతో శుభసూచకం అన్నారు. మంత్రి కేటీఆర్ కృషి వల్లే ఈ రోజు కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో కంపెనీలు ఏర్పాటు జరుగుతున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న కంపెనీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కంపెనీల ఏర్పాటుచేయాలని చూస్తున్నారంటే దాని వెనకాల మంత్రి కేటీఆర్ కఠోర శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. వచ్చే జూన్ నెల నుంచి ఆగస్టు నెల వరకు 800 కంటైనర్లలో కంపెనీ నిర్మాణానికి సంబందించిన మిషనరీ రానున్నట్లు వారు తెలిపారు. 201 ఎకరాలలో నిర్మించనున్న ఈ కైటెక్స్ కంపెనీలో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐ.టి.ఐ. విద్యార్హతలున్న వారికి టెక్నీకల్ విభాగంలో, అకౌంట్స్ విభాగంలో మరికొందరికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కంపెనీ ఏర్పాటు తర్వాత 9000 మంది మహిళలు, 2000 మందికి పురుషులకు కూడా ఉపాధి దొరుకుంతందని అన్నారు. వీరందికీ 15 రోజులు కంపెనీ వాళ్ళే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్ తో ముందుకెళ్తున్నారన్నారు.