కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ

పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. పరకాల పట్టణంలోని బీసీ కాలనీలో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రచార వాహనాన్ని మంగళవారం రాత్రి తీసుకువచ్చారు. కాలనీకి చెందిన కోలాటాల నిర్వాహకులను ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరడంతో… ప్రతిరోజు తాము టీఆర్‌ఎస్‌ ప్రచారానికే వెళ్తున్నామని, ఈ ఒక్కరోజు మీకు రావాలంటే రాలేమని చెప్పడంతో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ ఒక్కసారి రండి అంటూ బలవంతంగా కోలాటాల వారిని తీసుకెళ్లి కాంగ్రెస్‌ టీషర్టులను ధరించాలని అనడంతో కోలాటాల నిర్వాహకులు అంగీకరించలేదు. కాగా…

ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ‘మా ప్రచారానికి సంబంధించిన కోలాటాల నిర్వాహకులను బలవంతంగా తీసుకుపోవడం ఏమిటి’ అనిని అని నిలదీయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. అనంతరం ఈ విషయం ఫోన్‌ల ద్వారా తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరుకోవడంతో ఘర్షణ పెద్దదైంది. రెండు వర్గాలుగా చేరి ఒకవైపు కొండా నాయకత్వం వర్ధిల్లాలి అంటే మరోవైపు చల్లా నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సంఘటనా స్థలం నుంచి పంపించారు.