వరంగల్‌: జిల్లా ప్రజా పరిషత్‌ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్‌ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌ కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు. గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్‌ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్‌లు ఉండగా జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్‌లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్‌లకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్‌లకు ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, కోఆప్షన్‌ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్‌ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు.
కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్‌ టు సర్వ్‌ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్‌ జెడ్పీగా ఉన్న వరంగల్‌ జిల్లా పరిషత్‌ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్‌కు నివేదించారు.