పండిన పంటలతో మూడుపూటలా తృప్తిగా తిన్న రైతు బిడ్డలు వారు, కాయకష్టం చేయడం, పండిన దాంట్లో తినడం తప్ప కుళ్లూ కుతంత్రాలెరుగని అమాయకులు వాళ్లు, కానీ కాలం కన్నెరజేస్తె ప్రపంచానికి అన్నం పెట్టే వాళ్ళే, ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. అవును, ఒక్కసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ లోని శ్రమజీవుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతోంది. రైతే రాజు అని బీరాలు పలుకుతున్న మన నేతల మాటలకు. అక్కడి వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పోలీకే ఉండదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ దగ్గరలోని కొన్ని గ్రామాలలో గత కొన్నేళ్లుగా కరువు రాజ్యమేలుతోంది. తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి, కడుపు నింపుకోవడం కోసం ఎండిన గడ్డి మొక్కలలో ఉండే గింజల నుండి వచ్చే పిండి ద్వారా రోట్టెలను చేసుకుంటున్నారు. ఆ గండి మొక్కలను ‘ఫికార్’ అంటారు.

ఈ రొట్టెలలోకి ‘సమాయ్’ అనే కలుపు మొక్కల ఆకులను ఉడికించి, వాటికి కొంచెం ఉప్పు,నూనె కలిపి కూరగా చేసుకొని తింటూ రోజులు గడుపుతున్నారు. రెండేళ్ళలో ఇక్కడ మూడు పంటలను వేయగా అకాల వర్షాల కారణంగా పంటమొత్తం నాశనమయ్యింది. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సిన ప్రభుత్వాలు ఉండి కూడా వీరి పరిస్థితి ఇలా ఉంటే,ఇక వారికి దిక్కెవరు? కరువు వచ్చినప్పుడు నష్టపోయిన పంటకు సబ్సిడీ కింద ఎంతో కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.! మొదటగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వం ఫ్రీగా అందించే ప్రయత్నం చేయాలి, వారిని అన్ని విధాలుగా ఆదుకొని మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. అప్పుడే భూమిని నమ్ముకున్నోళ్ళు అకలితో కాలం గడిపే రోజులకు శుభం కార్డ్ పడుతుంది.