హైదరాబాద్ : గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై నేడు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడారం జాతరకు గుర్తింపు పెరిగిందని, గత రెండుసార్లు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మేడారం జాతర పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వసతుల కల్పన చేయడంతో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని మంత్రులు తెలిపారు.
గత రెండుసార్లు జాతరలో భక్తులకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల అధికారులు ఈసారి ఆ లోపాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మేడారం జాతర నిర్వహణలో అనుభవజ్ణులైన అధికారులు, సిబ్బంది ఎక్కడున్నా వారిని డిప్యూటేషన్ మీద తీసుకుని, వారి సేవలను వినియోగించుకోవాలని, తద్వారా మేడారం జాతరలో వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని తెలిపారు.

మేడారం జాతర ఏర్పాట్లలో గతంలో కొన్ని చిన్ని, చిన్న ఇబ్బందులు వచ్చి కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈసారి అలాంటా వాటికి తావివ్వకుండా వారితో సమావేశాలు నిర్వహించి అందరినీ భాగస్వామ్యంతో జాతర జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మేడారం జాతర ఏర్పాట్లలో భాగంగా ఆయా డిపార్ట్ మెంట్ల అధికారులు వెంటనే శాఖల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వచ్చే 90 రోజులకు ఆయా శాఖల పరంగా ఏయే పనులు చేయాలనేదానిపై పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని సిద్ధంగా ఉండాలని, మరో సమావేశం నాటికి ఇంకా ఏమి కావాలి, ఏం చేయగలమనే దానికిక స్పష్టత ఇవ్వాలన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మేడారం జాతర కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశారని, వెంటనే ఈ జాతరకు సంబంధించిన 21 డిపార్ట్ మెంట్లు వారి పనులను ప్రారంభించాలని, సంక్రాంతిలోపు పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని కచ్చితంగా చెప్పారు. మేడారం జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అని, దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు సందర్శించే ఈ జాతరను జాతీయంగా, అంతర్జాతీయంగా బ్రాండింగ్ చేయాలని, జాతర చరిత్ర, విశిష్టతలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక షోలు వేయాలని సూచించారు. దేశంలోని ముఖ్యమైన విఐపిలను, గిరిజన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

దేశంలోనే అతి ఎక్కువమంది సందర్శించుకునే మేడారం గిరిజన జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అయినా మరోసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి దీనిని జాతీయ పండగగా గుర్తించే వరకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో జాతరలో వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దీనికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. త్వరలోనే పూజారుల కమిటీ వేస్తామని, స్థానికులు, ఆదివాసీల అభిప్రాయం మేరకు దీనిని ఏఱ్పాటు చేస్తామని చెప్పారు.