చంద్రబాబు నాయుడు ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు రాష్ట్రం ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడం లో ఆయన పాత్ర కూడా కీలకంగా ఉంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల జాబితాలో ఉంటాడు. ప్రస్తుత ప్రధానితో పాటు ఇంకా ఎంతో మంది కేంద్ర ముఖ్య నాయకులు చంద్రబాబు కంటే జూనియర్‌ లే అంటూ రాజకీయ ఉద్దండులు చెబుతూ ఉంటారు. సుదీర్ఘ కాలంగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలు అయ్యిందనే విషయం తెల్సిందే. చిన్నప్పటి నుండే ప్రజా సేవ పట్ల ఆసక్తి ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రజా సేవ చేయాలనుకున్నాడు. కాని ప్రభుత్వ ఉద్యోగం చేయడం కంటే రాజకీయాల్లో ఉంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో చదువుకునే రోజుల్లోనే యువజన కాంగ్రెస్ లో చేరాడు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ప్రచారం చేసేవారు. తక్కువ సమయంలోనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దృష్టిలో పడటంతో పాటు ఏకంగా సంజయ్ గాంధీ కి కూడా సన్నిహితుడిగా పేరు దక్కించుకున్నారు. తద్వార చిన్న వయసులోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది.

మూడు పదుల వయసు కూడా రాకుండానే ఎమ్మెల్యే గా ఆ వెంటనే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేయడంతో ఎన్టీఆర్ దృష్టిలో పడ్డాడు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం నచ్చిన ఎన్టీఆర్‌ తన కూతురు భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేశాడు.
చంద్రబాబు నాయుడు పెళ్లి అయిన సంవత్సరంకు ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని ఏర్పాటు చేయడం జరిగింది. మామ పార్టీ ఏర్పాటు చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో వెళ్లలేదు. పార్టీ ఆదేశిస్తే మామ పై పోటీకి కూడా సిద్ధం అయ్యాడు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నారా చంద్రబాబు నాయుడు పై తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసిన వెంకట్రామ నాయుడు గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కూడా కొన్నాళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ లో కొనసాగాడు. ఎన్టీఆర్‌ అధికారంలో ఉండగా అల్లుడు చంద్రబాబు నాయుడు బయటి పార్టీలో ఉంటే బాగుండదు అనే ఉద్దేశ్యంతో టీడీపీ నాయకులు పలువురు చర్చలు జరిపి చంద్ర బాబు ను టీడీపీ లోకి తీసుకు వచ్చారు. అలా 1984లో టీడీపీలోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అంచలు అంచలుగా ఎదుగుతూ ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు పలు సార్లు సీఎంగా కూడా పదవి నిర్వహించారు.