ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ మండలం మేడారంలోని వనదేవతలను ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మలను దర్షించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. మేడారంలోని వనదేవతలను దర్శించుకోవడానికి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తిస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు.

కుటుంబాలతో వాహనాల్లో తరలివచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు చేసి, అక్కడే తలనీలాలు సమర్పించుకొని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను దర్షించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని భక్తులు వనదేవతలకు మొక్కులు అప్పగించుకున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి దర్శనం చేసుకొన్న భక్తులు జంతుబలి గావించారు. అనంతరం అడవిలోని చెట్ల కింద విడిది ఏర్పాటు చేసుకుని భోజనాలు చేశారు.

ఆ తరువాత వయసుతో భేదంలేకుండా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ, పట్టణప్రాంతాలను మరచిపోయి ఉల్లాసంగా గడిపారు. అనంతరం పచ్చని చెట్లు, సెలయేర్ల వద్ద కొద్ది సేపు విశ్రమించారు.