కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున జంగంపల్లి చెక్‌పోస్టు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలోని జంగంపల్లి గ్రామ శివారులో గల చెక్‌పోస్టు పక్కన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు కారులో వెళ్లుతుండగా రోడ్డు పక్కన ఉన్న మైలురాయిని ఢీకొన్న అనంతరం మర్రి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సిఐ యాలాద్రి, ఎస్‌ఐ నవీన్‌కుమార్ పోలీసు బృందంతో అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కున్న నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. 

మృతి చెందిన వారిలో నవీపేటకు చెందిన ప్రశాంత్(26), ఆర్మూరుకు చెందిన సుశీల్(28) నిజామాబాద్‌కు చెందిన లావణ్య( 35), రోషిని(15) ఉన్నట్లు సిఐ యాలాద్రి తెలిపారు. తమ బంధువును ఎయిర్‌పోర్టులో వదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ప్పి శ్వేతారెడ్డి, డిఎస్‌ప్పి లక్ష్మినారాయణలు సందర్శించారు.