రోజూ బస్టాండ్, రైల్వే స్టేషన్‌, ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద అనేక మంది హిజ్రాలు తారసపడుతుంటారు. వారిని చూసినప్పుడు చాలా మంది అసహ్యించుకుంటూ దూరంగా వెళ్తుంటారు. అంతే గాక హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారూ లేకపోలేదు. అంటే హిజ్రాలు ప్రవర్తించే తీరును బట్టే వారిని చూసే కోణం మారుతుంటుంది. తాజాగా ట్రాన్స్‌జెండర్లు ఓ మంచి పని చేసి అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. ట్రైన్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. షేక్‌పనురా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్తతో కలిసి హౌరా నుంచి లఖిసరాయ్‌కు హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్తోంది. రైలు జాసిదిహ్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మహిళకు పురిటి నొప్పులు రావడం ప్రారంభించాయి.

గర్భిణి నొప్పులతో అవస్థలు పడుతున్న భార్య పరిస్థితిని గమనించిన భర్త సాయం కోసం కోచ్‌లోని ఇతర మహిళలను ప్రదేయపడ్డాడు. అయితే ప్రవస వేదనతో బాధపడుతున్న మహిళకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సమయం గస్తున్న కొద్దీ బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడం ప్రారంభించింది. ఇంతలో అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది హిజ్రాలు గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించారు. వెంటనే గర్భిణీని రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. సదరు మహిల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కోచ్‌లోని ప్రతి ఒక్కరూ హిజ్రాలను అభినందించారు.