కొద్దిసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు బ్యాండ్ మేళం సౌండుకు గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ విషాద సంఘటన బీహార్‌లోని సీతామఢి జిల్లా సోన్‌బర్సా బ్లాక్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అదే జిల్లాలోని మనిక్తర్ గ్రామానికి చెందిన సురేంద్రకు బుధవారం ఆత్రి ఇందర్వ గ్రామంలో వివాహం జరగాల్సి ఉంది. కల్యాణ మండపానికి బారాత్ (ఊరేగింపు) చేరుకున్న తర్వాత వరుడికి పూల దండలు వేసే కార్యక్రమం పూర్తయింది. ఇక పెళ్లి పీటల మీదకు చేరుకుని తాళి కట్టడమే మిగిలి ఉంది.

ఈ సమయంలో సురేంద్ర హఠాత్తుగా మండపపం పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు డాక్లర్లు ప్రకటించారు. సురేంద్ర గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా..సురేంద్ర మరణానికి బ్యాండు మేళం కారణం కావచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. కల్యాణ మండపానికి చేరుకోగానే బ్యాండు సౌండు తగ్గించమని సురేంద్ర కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని వారు చెప్పారు. చెవులు చిల్లులు పడేలా వినిపిస్తున్న సౌండుకు సురేంద్ర డుండెపోటుకు గురై ఉంటాడని వారు భావిస్తున్నారు.