అయ్యప్ప మాల వేసుకునే ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని రాచకొండ కమీషనరేట్ నిర్ణయించింది. ఒకవేళ మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే వాళ్లు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటారు.

ఈ క్రమంలోనే కొందరు పోలీసు సిబ్బంది అధికారుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌ భగవత్‌ ప్రధాన కార్యాలయం ప్రత్యేక మెమో జారీ చేసింది. యూనిఫాం, షూ లేకుండా పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదని అందులో స్పష్టం చేసింది. అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని ఇందులో సిబ్బందికి సూచించారు. పోలీస్‌ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని చెప్పారు. అవసరమైన వారు రెండు నెలలపాటు సెలవు తీసుకుని దీక్ష చేపట్టవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి విజ్ఞప్తులను తమ కార్యాలయానికి పంపించొద్దని సీపీ మహేష్‌ భగవత్‌ కార్యాలయం స్పష్టం చేసింది…

ముస్లింలకు ఒక న్యాయం ! హిందువులకు ఒక న్యాయమా?: రాజాసింగ్

అయ్యప్ప మాల వేసుకునే పోలీసులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని రాచకొండ సిపి మహేష్‌ భగవత్‌ చేసిన ఆదేశాలపై బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయ్యప్పమాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటి’ ? రంజాన్ సమయంలో ఇలాంటి మెమోలు రిలీజ్ చేయాలని అన్పించలేదా? హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టమా? అని ప్రశ్నించారు.

ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలాంటి స్వేచ్ఛను ఇస్తారో, హిందువులకు కూడా అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ ఆదేశాలు ఇచ్చారని, ఈ ఆదేశాలు పై నుండి వచ్చాయా? లేక ముఖ్యమంత్రి నుండి వచ్చాయా? చెప్పాలి’ అని రాజా సింగ్ డిమాండ్ చేశారు. కాగా, అయ్యప్ప మాల వేసుకునే పోలీసులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని, ఒకవేళ మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే వాళ్లు సెలవుపై వెళ్లాలని మహేశ్‌ భగవత్‌ బుధవారం ఆదేశాలను జారీ చేశారు…