పెంట్లవెల్లి: కళ్ల ముందే కన్నతండ్రి నీటమునుగుతుంటే ఒడ్డునే ఉన్న కుమారులు కాపాడాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. తండ్రి మరణ దృశ్యాన్ని ఏకంగా వీడియో తీసి పైశాచికానందం పొందారు. ఆపై ఏమీ ఎరగనట్లు ఇంటికి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం: పెంట్లవెల్లికి చెందిన కేశంపోగుల కృష్ణయ్య, గోవిందమ్మ దంపతులకు రవితేజ, ఉదయ్‌కుమార్‌ అనే కుమారులతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గ్రామంలో పెద్ద దేవర్ల పండగ జరగ్గా ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణయ్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ సాయంత్రం వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చౌవుట చెరువు వద్ద కుమారులకు తండ్రి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని ఇంటికి రావాలని కోరినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో మరోసారి తండ్రికి, కుమారులకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

మద్యం కావాలని తండ్రి అడగడంతో చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి వరకు ఈదుకుంటూ వెళ్తే మద్యం ఇప్పిస్తామని కుమారులు పందెం కాశారు. మత్తులో ఉన్న కృష్ణయ్య అందుకు ఒప్పుకొని చెరువులోకి దిగి ఈదడం మొదలుపెట్టాడు. సగ దూరం వెళ్లాక ఈదలేక నీటిలో మునిగిపోయాడు. చెరువు ఒడ్డున ఉండి ఇదంతా సెల్‌ఫోన్‌లో వీడియో తీసున్న కుమారులు తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వెళ్లి అందరితో కలిసి పండుగలో సందడి చేశారు. బుధవారం సాయంత్రం వరకు కృష్ణయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య గోవిందమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆయన కోసం ఆరా తీశారు.

గ్రామస్తుల సమక్షంలో కుమారులు రవితేజ, ఉదయ్‌కుమార్‌ను గట్టిగా నిలదీయగా వారు తండ్రి నీటిలో మునిగిపోతున్న వీడియోను గ్రామస్తులకు చూపించారు. గోవిందమ్మ గురువారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం చెరువులో తేలిన మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ రామేశ్వర్‌రెడ్డి తెలిపారు.