హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే: నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్‌పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు.

ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా.? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.