తెలంగాణ బంద్ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీసులు ఆందోళనలు చేస్తున్న నేతలు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. ఆ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నిరసన చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటన వేలు తెగి పోయింది. అది చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. అరే అదేంటి వేలు తెగిపోయింది అయ్యయ్యో రక్తం కారిపోతోందే అని అందరూ ఆందోళన చెందారు.

ఇది ఎలా జరిగిందంటే ఆందోళన చేస్తున్న ఆయన్ను పోలీసులు వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో రెండు తలుపులు మూసేస్తుంటే అదే సమయంలో ఆయన చెయ్యి బయటకు ఉండిపోయింది. ఆ చెయ్యిని లోపలికి తీసుకునే క్షణాల్లో అప్పటికే డోర్ మూసుకుపోవడంతో బొటనవేలు బయటకు ఉండిపోయి కట్ అయ్యింది. కావాలనే పోలీసులు ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“సీఎం కేసీఆర్ నన్ను చంపమన్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా” అని పోలీసులను పోటు రంగారావు ప్రశ్నించారు. పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ బంద్‌లో ఇలాంటి ఘటన జరగడం అక్కడున్న వారందర్నీ కలచివేసింది.