తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్ ను పొడగించింది కోర్ట్. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు వర్చువల్ గా వనమా రాఘవను కోర్ట్ లో హాజరు పరిచారు. కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ గడువు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

రామకృష్ణ భార్యను తీసుకురమ్మంటూ వనమా రాఘవేంద్ర కోరడం దీనిపై సెల్ఫీ వీడియోలో తన బాధను రామకృష్ణ బయటపెట్టడంతో ఇది వైరల్ గా మారింది. టీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా రాఘవేంద్ర ఉండటంతో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని రోజులు పోలీసులకు దొరకకుండా ఉన్న రాఘవను పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు.