హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి శాసనమండలి చైర్మన్ పదవి దక్కే అవకాశం కనపడుతోంది. మండలి ప్రస్తుత చైర్మన్ స్వామి గౌడ్ పదవీకాలం మార్చి 23న ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కడియంను నియమించనున్నట్టు సమాచారం. పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా గెలిచిన స్వామిగౌడ్.. మరోసారి ఎన్నికల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన కడియం వైపే ఆయన మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఎస్టీ వర్గానికి చెందిన రెడ్యా నాయక్ లేదా రేఖా నాయక్‌లలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనపడుతోంది. లంబాడీ సామాజిక వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా రెడ్యా నాయక్ ఉన్నారు. దీంతో తొలి ప్రాధాన్యత ఆయనకు ఇచ్చారని, ఒకవేళ ఆయన ఆసక్తి చూపని నేపథ్యంలో రేఖా నాయక్‌కు పదవి కట్టబెట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్టీ కోటా, మహిళా కోటా కింద ఆమెకు ఇవ్వనున్నట్టు సమాచారం. మండలిలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా నేతి విద్యాసాగర్ రావు ఉన్నారు.