తెలంగాణలో గ్రూప్ -1 ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభ వార్త అందించింది.

జోన్ల విభజన కారణంగా నిలిచిపోయిన గ్రూప్ -1 నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని టిఎస్ పిఎస్సి సెక్రటరీ వాణి ప్రసాద్ తెలిపారు. టిఎస్ పిఎస్ సి ఏర్పడి మంగళవారంతో నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వాణి ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు 38 వేల 59 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని వాణి ప్రసాద్ తెలిపారు. 101 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటి వరకు 16 వేల 50 పోస్టులను భర్తీ చేశామని ఆమె పేర్కొన్నారు. 20 వేల 260 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. వివిధ కారణాల వల్ల 1877 పోస్టుల భర్తీ నిలిచిపోయిందని చెప్పారు.

ఇప్పటి వరకు టీఎస్ నిర్వహించిన అన్ని పరీక్షలకు 34 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. టిఆర్ టి(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్)కి సంబంధించి ప్రాసెస్ కొనసాగుతోందని, కోర్టు అనుమతితో త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామని ఆమె తెలిపారు.